సాలార్‌జంగ్‌ మ్యూజియం చరిత్ర

భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూసీనదికి దక్షిణతీరంలో క్రీ.శ. 1951లో ఈ మ్యూజియం స్థాపించబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక అపురూప, అద్భుత వస్తువులను సేకరించిన ఘనత సాలార్‌జంగ్‌ కుటుంబానిదే. దక్కన్‌ ప్రాంతంలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన కుటుంబాల్లో ఇదొకటి. హైదరాబాద్‌ నిజాం పాలనలో ఈ కుటుంబం నుండి ఐదుగురు ప్రధానమంత్రులుగా పనిచేసారు. క్రీ.శ.1912లో నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటే ఏడవ నిజాం, నవాబ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. వీరినే మూడవ సాలార్‌జంగ్‌ అంటారు. ఈయన దీవాన్‌ లేదా ప్రధానమంత్రి పదవిని క్రీ.శ.1914లో వదిలేసి, మిగిలిన జీవితమంతా సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికై కృషి చేసారు. దాంతో కళల పట్ల ఆయనకున్న అభిరుచి నలువైపులా పాకింది. అలా ఆయన పూర్వీకుల భవనమైన దివాన్‌దేవిడి, నలుమూలల నుండి వచ్చిన అమ్మకందార్లతో ఎప్పుడూ నిండి వుండేది. ఆయన ఏజెంట్లు విదేశాల్లో కూడా ఉండేవారు. వారు డీలర్లనుండి సేకరించిన ప్రాచీన వస్తువుల వివరాలను, కేటలాగులను పంపిస్తూ ఉండేవారు. ఇవే కాక ఆయన స్వయంగా యూరప్‌, మిడిల్‌ఈస్ట్‌ దేశాల పర్యటనలు చేసి, అనేక వస్తువులను సేకరించేవారు.

ఆయన ప్రాచీన కళాఖండాల, వ్రాతప్రతుల సేకరణతో బాటు కళాకారులను, వులను, రచయితలనూ పోషించేవారు. సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు. కుటుంబసభ్యుల పుస్తకాలను ఎన్నింటినో ప్రచురించారు. ఈ పనులన్నీ మార్చి 2, 1949 నాటివరకు అంటే ఆయన మరణించేవరకు అవిశ్రాంతంగా 60 సం||పాటు జరిగాయి. వారసులు లేనందున ఆ అపార కళాసంపద అలా మిగిలిపోయింది. దాంతో నవాబ్‌గారి కుటుంబసభ్యులు ఆలోచించి ఆ అద్భుత సంపదను దేశానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. వాటి పరిరక్షణకు ఇదే మంచి మార్గమని నిర్ణయించుకొన్నారు.

ఈ కళాసంపద అంతా మ్యూజియం రూపంలో (కీ||శే|| సాలార్‌జంగ్‌గారి స్వగృహం) దీవాన్‌దేవిడీలో 16 డిసెంబర్‌ 1951 నాడు ప్రారంభమయింది. భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గారిచే ప్రజల సందర్శనార్థం తెరువబడింది. తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో భారత ప్రభుత్వం ఈ సంపదను స్వాధీనం చేసుకుంది. తొలిరోజుల్లో మినిస్ట్రీ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి మరియు కల్చరల్‌ అఫైర్స్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహణ బాధ్యతలను చూసుకొనేది. క్రీ.శ.1961లో ఆక్ట్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ద్వారా మ్యూజియం, దాని అనుబంధంగా వున్న లైబ్రరీతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు.

క్రీ.శ.1968లో నాటి భారత రాష్ట్రపతి డా. జాకీర్‌ హుస్సేన్‌ గారిచే ప్రస్తుత భవనంలో మ్యూజియం ప్రారంభించబడింది. నిర్వహణ బాధ్యత స్వయం ప్రతిపత్తిగల బోర్డుకు అప్పగించారు. దీనికి ఛైర్మన్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్ర గవర్నరు దీనికి ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

క్లుప్తంగా సాలార్‌జంగ్‌ కుటుంబ చరిత్ర

ఈయన 13 ఏళ్ల వయస్సులోనే సాలార్‌జంగ్‌ బహదూర్‌ అనే బిరుదు పొందారు. నాల్గవ నిజాం అంటే నవాబ్‌ మీర్‌ ఫర్కుందా అలీఖాన్‌ నాసిర్‌-ఉద్‌-దౌలా 24 ఏళ్ల వయస్సులో ప్రధానమంత్రిగా నియమించారు. ఒకటవ సాలార్‌జంగ్‌ చురుకైన పరిపాలకునిగా, సంస్కరణశీలిగా, కళాపోషకునిగా ప్రసిద్ధికెక్కాడు. సాలార్‌జంగ్‌-1 యూరోపియన్‌ రాజకుటుంబాలలో జరిగే వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో తయారుచేసే మెమెంటోలు, స్మారక చిహ్నాలను చాలా అభిమానించాడు. అలా క్రీ.శ.1876లో ఇంగ్లాండుకు వెళ్ళినప్పుడు తన చిత్తరువులున్న పింగాణీ వస్తువులకు ఆర్డరిచ్చాడు. ముసుగులో ఉన్న రెబెకా శిల్పాన్ని, ఎన్నో ఉత్తమ కళాఖండాలను ఆయనే భారతదేశానికి తీసుకొని వచ్చారు. ఈ రెబెకా నేడు మ్యూజియంలో ఉన్న అత్యుత్తమ కళాఖండాలలో ఒకటి. ఈయన క్రీ.శ.1883లో మరణించాడు.

ఈయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. లాయఖ్‌ అలీఖాన్‌, సాదత్‌ అలీఖాన్‌ కొడుకులైతే, నూర్‌ ఉన్నీసా బేగం, సుల్తాన్‌ భక్త్‌ బేగం కుమార్తెలు. ఆయన పెద్ద కొడుకు మీర్‌ లాయఖ్‌ అలీఖాన్‌ మొదట కౌన్సిల్‌ ఆఫ్‌ రీజెన్సీకి సెక్రటరీగానూ తరువాత కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌కు మెంబర్‌గా నియమించబడ్డాడు. ఆరవ నిజామైన నవాబ్‌ మీర్‌ మెహబూబ్‌ అలీఖాన్‌ చేత క్రీ.శ.1884లో ప్రధానమంత్రిగా నియమితుడవడమే గాక, ఇమాద్‌-ఉస్‌-సల్తనత్‌ అనే బిరుదును కూడా పొందాడు. తన సమయంలో అధిక భాగం తండ్రి ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనసాగిస్తూ, గొప్ప పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ 26వ ఏట పూనాలో మరణించాడు. చనిపోయేనాటికి అబ్దుల్‌ ఖాసిం మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ అనే పేరున్న 24 రోజుల వయసున్న కొడుకున్నాడు. లాయఖ్‌ అలీఖాన్‌ తల్లి జైనాజ్‌ బేగం పసికందును తీసుకొని హైదరాబాద్‌ వచ్చేసింది.

మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌కు 10 ఏళ్ల వయస్సులో నిజాం అతనికి వారి కుటుంబ బిరుదైన సాలార్‌జంగ్‌ను ప్రసాదించాడు. దాంతోబాటే మన్సబ్‌తో సహా ఇతర బిరుదులను పునరుద్ధరించాడు. అతని పెంపకంలో కూడా మిక్కిలి శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యమైన ఆస్తులపై అధికారం వచ్చాక, విలువైన కళాసంపదను సేకరించి, ఒక గొప్ప కళా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు. 1480 చదరపు మైళ్ల భూభాగంతో, 450 గ్రామాలకు విశాలమైన ఎస్టేట్‌కు, అపారసంపదలకు వారసుడైనాడు. దీని ఆదాయం సాలీనా 23 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఇది చాలా పెద్దమొత్తం. భారత, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఫార్‌ ఈస్ట్రన్‌ దేశాల కళల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కళాపిపాసి. పిన్న వయస్సు నుండే పలు దేశాల నుండి అరుదైన కళాకృతులను సేకరించడం పట్ల ఆసక్తి కనబరచేవాడు.

బంగారు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన కట్లెరీలను, క్రాకరీలను వాడే యూరోపియన్‌ రాచ కుటుంబ సంప్రదాయాలను మూడవ సాలార్‌జంగ్‌ అనుసరించాడు. మ్యూజియంలో ఉన్న అనేక గృహోపకరణ వస్తువులు దీనికి గుర్తు. ఏడవ నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మూడవ సాలార్‌జంగ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ను 1912లో ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా 1914లో ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత నుంచీ తన సమయాన్నంతా కళావస్తువుల సేకరణకై వెచ్చించాడు.